ఆర్థికాభివృద్ధిలో మేమే నెంబర్‌ 1 | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధిలో మేమే నెంబర్‌ 1

Published Fri, Jan 19 2018 1:36 AM

Kcr says india today conclave Telangana Top in the country Economic Development  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణను పునర్నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని, ఆర్థికాభివృద్ధిలో ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఆంధ్రా, తెలంగాణలకు చాలా తేడా ఉందని, ఇరు ప్రాంతాల ప్రజల జీవన విధానం కూడా వేరని పేర్కొన్నారు. తెలుగు అనే ప్రత్యేక గుర్తింపు లేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రా – తెలంగాణల విలీనం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. అది విఫల ప్రయత్నమని రుజువైందన్నారు. తాము రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన ‘ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌–2018’కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్‌ సవివరంగా సమాధానమిచ్చారు. 

అభివృద్ధిలో దూసుకుపోతున్నాం 
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని కేసీఆర్‌ చెప్పారు. కాగ్‌ కూడా 16 అంశాల్లో పరిశీలన జరిపి తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్‌ రాష్ట్రమని చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.49 లక్షల కోట్లతో బడ్జెట్‌ పెట్టామని.. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ చరిత్ర తెలిస్తే సంపద సృష్టించింది ఎవరో తెలుస్తుందని స్పష్టం చేశారు. మార్వాడీలు 300 ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చారని, ఇక్కడి పాతబస్తీలో గుల్జార్‌హౌస్‌ ఉందని, నిజాం సమయంలోనే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. హైదరాబాద్‌ విషయంలో ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడే ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విద్యుత్‌ సంక్షోభం నుంచి బయటపడ్డామని, ఇప్పుడు 24 గంటల కరెంట్‌ ఇచ్చే స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణను చిన్న రాష్ట్రమంటే అంగీకరించబోమన్నారు. హైదరాబాద్‌ చరిత్ర తెలిసిన వారెవరైనా అది తెలంగాణలో అంతర్భాగమేనని అంగీకరిస్తారని.. ఎన్నో మతాల వాళ్లు, ప్రాంతాల వాళ్లు ఇక్కడ కలసి జీవిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. 
 
సంపద సృష్టిస్తున్నాం 
తెలంగాణకు రోజూ 650 లారీల గొర్రెలు దిగుమతయ్యేవని, తాము రూ. 5 వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల పంపిణీ చేపట్టామని కేసీఆర్‌ చెప్పారు. త్వరలోనే రాష్ట్రం నుంచి దేశ విదేశాలకు మేలైన గొర్రెలు, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఇక తెలంగాణ ఏర్పడే నాటికి 6 వేల మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉందని, ఇప్పుడు 14 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. 2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని చెప్పారు. దేశంలోనే గొప్పగా రూ.40 వేల కోట్లతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 
 
కాగితాలపైనే జలాల కేటాయింపులు 
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయించిన నీళ్లు కాగితాల్లోనే ఉండేవని, లెక్కల్లో మాత్రమే కనిపించేవని కేసీఆర్‌ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు 1,350 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిందన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి లక్షలాది మంది వలసపోయేవారని, తాము ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి వలసలు నివారించామని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కష్టాలు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలు రాకుండా చర్యలు తీసుకున్నామని, పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 71 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు రూ.8 వేల చొప్పున సాగు పెట్టుబడి అందించనున్నామని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఏపీతో తెలంగాణను పోల్చవద్దని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు పోలికే లేదని చెప్పారు. గుజరాత్‌తోనో, అమరావతితోనే పోల్చవద్దన్నారు. భవిష్యత్తులో ఇక్కడ రైతుల ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. 
 
హైదరాబాద్‌ను విధ్వంసం చేశారు 
ఉమ్మడి రాష్ట్రంలో అందమైన హైదరాబాద్‌ నగరాన్ని ధ్వంసం చేశారని, హైదరాబాద్‌కు గార్డెన్‌ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని కేసీఆర్‌ వెల్లడించారు. 1915లోనే హైదరాబాద్‌లో విద్యుత్‌ సరఫరా ఉండేదని, ఆ తర్వాతే మద్రాసుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లోనే ఇక్కడ విమానాశ్రయం, టెలిగ్రాఫ్, ప్రత్యేక రైల్వేవ్యవస్థ, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఉండేవన్నారు. కానీ ఉమ్మడి పాలనలో ఇక్కడి భూములు, నాలాలు కబ్జా చేశారని, వెయ్యి దాకా ఉన్న చెరువులు, కుంటలు మాయమయ్యాయని చెప్పారు. తాము రూ.25వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. 
 
సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు 
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 90 శాతం ఉన్నారని, కేవలం 10 శాతమే ఉన్నత కులాల వారు ఉన్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలా 90 శాతమున్న వారికి 50 శాతం రిజర్వేషన్‌ ఎలా సరిపోతుందని, బలహీన వర్గాలకు అన్యాయం చేయలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గిరిజనులు 10 శాతముంటే 6 శాతంగా లెక్కగట్టారని, ఇక ముస్లింలు 14 శాతం ఉన్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, తమిళనాడులో 69శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితిని చూడాలని.. సామాజిక, ఆర్థిక వెనుకబాటును బట్టే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలనే కోరుకుంటామని, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. అవినీతిపరులు ఎవరో దేశమంతా తెలుసంటూ కాంగ్రెస్‌ నేతల విమర్శలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 
 
ఎవరితో పొత్తుల్లేవు.. స్వతంత్రంగా ఉంటాం 

టీఆర్‌ఎస్‌ పార్టీ యూపీఏలోగానీ, ఎన్డీయేలోగానీ చేరదని.. స్వతంత్రంగానే ఉంటామని కేసీఆర్‌ చెప్పారు. ఎవరితో వెళ్లాల్సిన పని టీఆర్‌ఎస్‌కు లేదని, టీఆర్‌ఎస్‌తో కలసి రావాలా, లేదా అన్నది ఇతర పార్టీలు తేల్చుకోవాలని పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వెళ్లే ఆలోచనేదీ లేదని, యావత్‌ తెలంగాణ తన కుటుంబమని, భావోద్వేగాలు తెలంగాణ చుట్టే ఉంటాయని చెప్పారు. తాను ఇక్కడే ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. మనది సహకార సమాఖ్య వ్యవస్థ అన్న ప్రధాని మాటలను సమర్థిస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రాల సంపదే జాతి సంపద అని, రాష్ట్రాలు మరింత ఎదిగేందుకు కేంద్రం అవకాశమివ్వాలని కోరారు. రాష్ట్రాలకు అధిక నిధులు, అధికారాలు ఇస్తే.. దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు త్వరలోనే ఎన్నారై పాలసీని తీసుకువస్తామన్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను గుర్తించామని, వివరాలు తెప్పించి 55 మందికి సాయం చేశామని తెలిపారు. జలదృశ్యం వద్ద అమరవీరుల స్తూపం నిర్మిస్తున్నామని, ఆవిష్కరణ సమయంలో అందరినీ సన్మానించుకుంటామని వెల్లడించారు. 
 
అద్భుతమైన సచివాలయం నిర్మిస్తాం 
రాష్ట్రంలో పాత సచివాలయం సరిగా లేదని, రూ.250 కోట్లతో కొత్త సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఇది వాస్తు సమస్య కాదన్నారు. విదేశీ ప్రతినిధులు వచ్చిన సందర్భంలో మలేసియా మంత్రి ఒకరు.. సచివాలయం స్థలాన్ని అమ్మేసి కొత్తది కట్టొచ్చు కదా అన్నారని చెప్పారు. ధనిక రాష్ట్రానికి తగినట్టుగా అద్భుతమైన సచివాలయం నిర్మిస్తామన్నారు. ఇక ప్రగతిభవన్‌ కేసీఆర్‌ సొంత ఇల్లు కాదని, అది తెలంగాణ సీఎం అధికారిక నివాసమని, కనీసం వందేళ్లు ఎందరో సీఎంలు ఉండేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబానికే అన్ని పదవులన్న ఆరోపణ సరికాదని.. కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజలు ఓట్లు వేస్తేనే ఎన్నికయ్యారని చెప్పారు.  

Advertisement
Advertisement